పశ్చిమగోదావరిలో నేడు కేంద్ర బృందం పర్యటన

అర్నబ్‌ తుఫాను నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలన

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : అర్నబ్‌ తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, విద్యుత్‌, గృహ నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలతో పాటు వివిధ రంగాలకు జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆదివారం జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. జలవనరుల మంత్రిత్వ శాఖకు చెందిన సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఎన్‌.వి. సతీష్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలను అంచనా వేస్తుందని పేర్కొన్నారు.

వివిధ రంగాలకు జరిగిన నష్టాలను పరిశీలించడంతో పాటు తుఫాను సమయంలో అధికారులు తీసుకున్న చర్యలు, నష్టాల వివరాలను బృందం తెలుసుకుంటుందని కలెక్టర్‌ తెలిపారు.