West Asia War | ఇరాన్–ఇజ్రాయెల్ దాడులతో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
West Asia War | ఇరాన్–ఇజ్రాయెల్ దాడులతో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
West Asia War | చమురు ధరల పెరుగుదలపై ప్రపంచానికి ఆందోళన
పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంలో భారత ఆర్థిక వ్యవస్థ
ఆర్బీఐ సర్వేలో తగ్గిన వినియోగదారుల విశ్వాసం
ద్రవ్యోల్బణ అంచనాలతో కుటుంబాల్లో పెరుగుతున్న జాగ్రత్త
ధరల పెరుగుదలపై పట్టణ, గ్రామీణ వినియోగదారుల ఆందోళన
West Asia War | న్యూఢిల్లీ: ఇరాన్-అమెరికా యుద్ధానికి 100 రోజులకు పైగా అయింది. ఇటీవల శాంతి ఒప్పందం కుదరుతుందన్న ఆశలు నెలకొన్నప్పటికీ, తాజాగా మళ్లీ సరస్పర దాడులతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ సరస్పర దాడులతో ఉద్రిక్తతలు పెరిగాయి. మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమవుతుందన్న భయాలు పెరుగుతున్నాయి.
ఇదే జరిగితే ఇప్పటి వరకు యుద్ధ ప్రభావాన్ని కొంతమేర తట్టుకున్న భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు విస్తృతమైన ఆర్థిక ప్రభావానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. మరికొన్ని నెలల పాటు ఘర్షణలు ఇలానే కొనసాగితే చమురు ధరలు మళ్లీ పెంచాల్సి వస్తుంది. వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా క్షీణిస్తాయి. సరఫరాలు మరింత క్లిష్టంగా మారి, తీవ్రమైన చమురు, గ్యాస్ కొరతకు దారి తీస్తుంది. దీని ప్రభావం ఆర్థిక రంగంలోని ప్రతి రంగంపైనా పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందానికి తూట్లు పడ్డాయి. దాడులు వెంటనే నిలిపివేయాలని అమెరికా కోరింది. అమెరికా మాటపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తేనే శాంతి సాధ్యమని భావిస్తున్నారు. శాంతి నెలకొంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసినట్లవుతుంది. ఘర్షణలు ఇలానే కొనసాగితే, అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణగా మారవచ్చని, ప్రపంచ చమురు మార్కెట్ల సరఫరా గొలుసుపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ముడి చమురును గణనీయంగా దిగుమతి చేసుకునే భారత్‌తో పాటు అనేక దేశాలపై దీని ప్రభావం తీవ్రస్థాయిలోనే ఉండనుంది.
గత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసిన భారత్, ప్రస్తుతం బాహ్య ఒడిదుడుకులను, దేశీయంగా ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. జూన్ 6న ఆర్బీఐ ఎంపీసీ సమావేశం వడ్డీ రేట్లను పెంచడం ద్వారా దూకుడుగా కఠిన చర్యలు తీసుకోకుండా, జాగ్రత్త వహించాలనే సంకేతాన్ని ఇచ్చింది. దేశీయంగా ఒత్తిళ్లతో పాటు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం వల్ల కలిగే ప్రభావాలను ఆర్బీఐ గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావించారు.
తగ్గిన వినియోగదారుల విశ్వాసం
ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన సర్వే ప్రకారం, మే నెలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల విశ్వాసం బలహీనపడింది. ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, విచక్షణతో కూడిన ఖర్చుల పట్ల కుటుంబాలు మరింత జాగ్రత్త వహించడం ప్రారంభించాయి. ఆర్బీఐ మేలో నిర్వహించిన పట్టణ వినియోగదారుల విశ్వాస సర్వే, గ్రామీణ వినియోగదారుల విశ్వాస సర్వే వినియోగదారుల సెంటిమెంట్‌లో భారీ క్షీణతను నమోదు చేశాయి.
ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ద్రవ్య విధానం అనుకూలంగా ఉన్నప్పటికీ, ధరల ఒత్తిళ్లు, వాటి ప్రభావంపై కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక సూచించింది. వరుసగా నిర్వహించిన మూడో సర్వేలో కూడా పట్టణ వినియోగదారుల విశ్వాసం తగ్గింది. ప్రస్తుత పరిస్థితి సూచిక మార్చిలో 95.7 నుంచి మే నెలలో 90.7కి తగ్గింది. భవిష్యత్ అంచనాల సూచిక న్యూట్రల్ 100 మార్క్‌పైగా ఉన్నప్పటికీ, ఇది 120.2 నుంచి 118.7కు తగ్గింది. ఇది 2023 సెప్టెంబర్ తరువాత అత్యంత కనిష్టస్థాయి.
గ్రామీణ సెంటిమెంట్ కూడా బలహీనపడింది. గ్రామీణ సీఎస్ఐ మార్చిలో 98.0 నుంచి 95.2కి తగ్గింది. భవిష్యత్ అంచనాల సూచిక 125.1 నుంచి 119.3కి పడిపోయింది. ఇది చాలా కొలమానాల్లో బలహీనమైన అంచనాలను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ క్షీణత గ్రామీణ కుటుంబాలలో కూడా పెరుగుతున్న జాగ్రత్తను సూచిస్తోందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
ఈ రెండు సర్వేలలో ఉన్న ఉమ్మడి అంశం ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మళ్లీ పెరగడమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ ప్రత్యేక గృహ ద్రవ్యోల్బణ అంచనాల సర్వే ప్రకారం, పట్టణ గృహాలు తమ మధ్యస్థ ద్రవ్యోల్బణ అంచనాను మార్చిలో 7.2 శాతం నుంచి మే నాటికి 7.8 శాతానికి పెంచుకున్నాయి. రానున్న మూడు నెలలు, ఒక సంవత్సరానికి వారి ద్రవ్యోల్బణ అంచనాలు ఒక్కొక్కటి 9.3 శాతానికి పెరిగాయి. ఇది వరుసగా 80 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తుంది.
గ్రామీణ కుటుంబాలు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై తమ ఆందోళనలను వెల్లడించాయి. మధ్యస్థ ద్రవ్యోల్బణ అవగాహన 5.6 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. ఒక సంవత్సరం ముందు ద్రవ్యోల్బణ అంచనాలు 6.8 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగాయి. ద్రవ్యోల్బణ అంచనాలలో పెరుగుదల వినియోగదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నది.
పట్టణ ప్రాంతాలలో కుటుంబాలు ప్రస్తుత ధరల పట్ల స్పష్టంగా, మరింత నిరాశావాదంతో ఉన్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణంపై అవగాహన కూడా క్షీణించింది. ధరల పెరుగుదల రేటు వేగంగా ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గ్రామీణ వినియోగదారులు కూడా ధరలు వేగంగా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
