అటవీ శాఖ దాడితో పరారీ
కడపలో సంచలనం
కడప, ఆంధ్రప్రభ బ్యూరో : కడప (Kadapa) జిల్లాలో సహజ ఖనిజ సంపదలను దోచుకోవటంలో.. మైనింగ్ మాఫియా అన్ని రాజకీయ పార్టీల్లోనూ తిష్టవేసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా సున్నపురాయి, బేరైట్స్ గనులను తవ్వేస్తున్నాయి. తాజాగా పెండ్లిమర్రి మండలంలోని తుమ్మలూరు గ్రామ సమీపంలో ఫారెస్ట్ లో అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలు వెలుగు చూశాయి. ఫారెస్ట్ అధికారి వెంకట సుబ్బయ్య (Forest Officer Venkata Subbaiah) శనివారం ఆకస్మిక దాడి చేసి ముగ్గురాయి తవ్వడానికి ఉపయోగించిన హిటాచి, టిప్పర్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్ వెనుక ఒక వైసీపీ, టిడిపి నేతల హస్తం ఉన్నట్లు సమాచారం.
కడప ఫారెస్ట్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తుమ్మలూరు అడవి ప్రాంతం. ఈ ప్రాంతం కడప బేసిన్‌లో భాగం, ఇక్కడ సున్నపు రాయి గనులు సమృద్ధిగా ఉన్నాయి. తుమ్మలూరు (Tummalur) గ్రామం పెండ్లిమర్రి మండలంలో భాగమే, ఇది కడప నగరం నుంచి సుమారు 20- నుంచి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ అడవీ ప్రాంతాల్లో అక్రమంగా సున్నపు రాయి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవి అటవీ చట్టాలు, గని నిబంధనలను ఉల్లంఘించి, పర్యావరణానికి, వన్యప్రాణులకు హాని కలిగించే రీతిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఘటనలో నిందితులు తప్పించుకుపోయారు.
గనుల ఖిల్లాలో మాఫియా తిష్ట…
కడప జిల్లా సున్నపు రాయి, బేరైట్స్, యురేనియం (Uranium) వంటి ఖనిజాలకు ప్రసిద్ధి. పెండ్లిమర్రి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో ఈ గనులు సమృద్ధి. అయితే, అక్రమ తవ్వకాలు రాష్ట్ర ఆదాయానికి నష్టం, అడవులకు విధ్వంసం కలిగిస్తున్నాయి. 2021 నుంచి కడప జిల్లాలో రాజకీయ జోక్యంతో అక్రమ గని తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


