హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలపై విస్తృత వర్షాల ప్రభావం ఉండనున్నట్లు స్పష్టం చేసింది.హైదరాబాద్ నగరంతోపాటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. నగరంలోని కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వర్షాల దృష్ట్యా జి హెచ్ ఎం సి,, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, రెస్క్యూ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.
అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, చెరువుల సమీపాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.