Chandrababu | సీమను ఫ్రూట్ బౌల్‌గా మారుస్తాం..
Chandrababu | సీమను ఫ్రూట్ బౌల్‌గా మారుస్తాం..
Chandrababu | మదనపల్లె, ఆంధ్రప్రభ: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కరవు నేలగా పేరున్న సీమ ప్రాంతాన్ని పండ్ల తోటల కేంద్రంగా (ఫ్రూట్ బౌల్) తీర్చిదిద్దుతామని చెప్పారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ)కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో ఉద్యాన పంటలు కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

సాగునీటి సౌకర్యం కల్పిస్తే రాయలసీమ రైతులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం అన్నారు. ఉత్పత్తికి సరైన మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే రైతులు సంపద సృష్టిస్తారని చెప్పారు. సీమ రైతులకు 20 రకాల పంటలను సాగు చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా పంటలకు మార్కెట్ అవకాశాలు, ధరల స్థిరీకరణ లభిస్తుందని తెలిపారు.
రాయలసీమ పరిస్థితులను మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీరు అందకపోతే మదనపల్లె ప్రాంతం నుంచి పెద్దఎత్తున వలసలు జరిగేవని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సాంకేతికత, పంట కుంటలు, జల సంరక్షణ పథకాల ద్వారా నీటి వినియోగాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
రూ.35 వేల కోట్ల వ్యయంతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసి మూడేళ్లలో జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకున్నామని సీఎం చెప్పారు. రాయలసీమలో హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీని చంద్రబాబు ప్రశంసించారు. పారిశ్రామిక రంగంతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఆయన సేవలు అభినందనీయమని అన్నారు. జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల్లో జంతు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిపై భక్తితో ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులు అందించడం అభినందనీయమని తెలిపారు.
