YS Jagan | ఆ కుటుంబానికి అండగా ఉంటాం…
YS Jagan | ఆ కుటుంబానికి అండగా ఉంటాం…
కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
YS Jagan | ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు. ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఒంగోలులోని క్లౌపేటలో ఉన్న కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లిన జగన్.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. రాజశేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

వైఎస్సార్‌సీపీ కోసం కాకుమాను రాజశేఖర్ అందించిన సేవలను జగన్ గుర్తుచేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పోషించిన పాత్రను ప్రస్తావిస్తూ, రాజశేఖర్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజశేఖర్ మృతి నేపథ్యంలో జగన్ గతంలోనూ సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
