భూములు ఇస్తాం.. ముందు పరిహారం తేల్చండి!

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుపై నిర్వాసితుల డిమాండ్
అభ్యంతరాలపై రేపు అనుకుంట లో గ్రామసభ
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : ఆదిలాబాద్‌లో రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు భూసేకరణ వేగవంతమైంది.

ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోని 209.31 ఎకరాల సేకరణకు కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకుంట, ఖానాపూర్, మిషన్ ఘాట్, అర్లిబి, కచ్‌కంటి, టాక్లి పరిధిలో దాదాపు 1,882 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉందని, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి రూ. 6 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనుకుంట గ్రామం అభ్యంతరం: అనుకుంట గ్రామంలో 80% భూములు సేకరిస్తూ ఊరిని వదిలేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన ధర ఇవ్వాలని, లేని ప‌క్షంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణలో భూములు కోల్పోతున్న వారి అభ్యంతరాలు స్వీకరించేందుకు శుక్రవారం అనుకుంటలో ఆర్డీఓ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నిర్వాసితులు తమ డిమాండ్లను అధికారుల ముందుంచనున్నారు.