Kavitha | కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తాం..

రేవంత్‌పై కవిత తీవ్ర విమర్శలు..


Kavitha | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్‌, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన పరిణామాలపై ఆమె స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో పరస్పర విమర్శలు, వాగ్వాదాలు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు.

మాజీ పార్లమెంటేరియన్‌గా, మాజీ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను బాధించాయని కవిత పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తే ప్రజా సమస్యలు పరిష్కరించవచ్చని, కానీ ప్రస్తుతం ప్రజాధనం వృథా అవుతోందని విమర్శించారు.

“అసెంబ్లీని ప్రచార వేదికగా వాడుకున్నారు”

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తనను తాను గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేశారని కవిత ఆరోపించారు. తనపై ఉన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు, తన ఇమేజ్‌ పెంచుకునేందుకు అసెంబ్లీని ఉపయోగించుకున్నారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఆమె.. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రేవంత్‌ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని వ్యాఖ్యానించారు.

“సిద్దిపేట భూములపై ఆధారాలు ఇస్తా”

సిద్దిపేటలో భూముల వ్యవహారంపై కవిత కీలక ఆరోపణలు చేశారు. ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉన్న భూములను తొలగించి రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను అందిస్తానని, నిజాలు బయటకు రావాలని ఆమె అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు.

ఈ నెల 20న కొడంగల్‌లో సభ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 20న పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి ఉండాలని, రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదని ఆమె సూచించారు.