జన్నారం, మే13 (ఆంధ్రప్రభ): కుల సంప్రదాయాలను దెబ్బతీస్తే సహించేది లేదని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయత్ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల మూడు రోజుల శిక్షణ ముగింపు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో మంగళవారం నిర్వహించగా, ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అనాదిగా ఆదివాసులు కుల, సంప్రదాయ కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతుందని, కాంగ్రెస్ తోనే అన్ని సాధ్యమైతాయని ఆమె చెప్పారు. అనాదిగా ఆదివాసీలు అడవుల్లో ఉంటూ ఆచార కట్టుబాట్లతో మెలుగుతున్నారని ఆమె తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తుందని, ఆర్ఎస్ఎస్ మను ధర్మాన్ని నమ్ముతుందని, ఆదివాసీలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్ముతారని ఆమె చెప్పారు. ఆదివాసీలను విద్యా, రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువస్తూ చైతన్య పరుస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ జాతీయ కన్వీనర్ కొప్పు రాజు, ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బేల్లయ్య నాయక్, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఏఐసీసీ జాతీయ కన్వీనర్ రాహుల్ బాల్, ప్రోగ్రాం ఇన్చార్జి రానాప్రతాప్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, ఎం.రాజశేఖర్, ఎస్పీరెడ్డి, అజ్మీర నందునాయక్, తదితరులు పాల్గొన్నారు.