YS Jagan | అన్యాయం చేసిన ఎవరినీ వదలం…
YS Jagan | అన్యాయం చేసిన ఎవరినీ వదలం…
స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయి
నామినేషన్ల అడ్డగింతపై ఆగ్రహం..
పోటీకి ఎందుకు భయపడుతున్నారంటూ కూటమిపై విమర్శలు
YS Jagan | పులివెందుల, ఆంధ్రప్రభ: ఇప్పుడు మీ టైం నడుస్తుంది… మా టైం తప్పక వస్తుంది… అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం… అన్యాయం చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మా కార్యకర్తలపై చేయివేస్తే.. నాపై చేయివేసినట్లేనన్నారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు. ఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచి, తామే విజయం సాధించామని చెప్పుకోవడం సరికాదన్నారు. పులివెందుల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
కౌరవుల కుట్రల్లా ఉన్నాయి..
స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు ఎదురైనా, కష్టాలు పడినా, దెబ్బలు తగిలినా పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని జగన్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల పరిణామాలను చూస్తుంటే కౌరవుల కుట్రలు గుర్తుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శకునిలా మాయా పాచికలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
నామినేషన్ కేంద్రాల ఆక్రమణపై విమర్శలు..
నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం ఎక్కడా చూడలేదని జగన్ అన్నారు. ఇలాంటి పరిణామాలు భావితరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలకు సహకరిస్తున్న అధికారులు తమ పాత్రపై ఆలోచించుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోటీకి ఎందుకు భయపడుతున్నారు?
ఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచి, తామే విజయం సాధించామని చెప్పుకోవడం సరైనదేనా అని జగన్ ప్రశ్నించారు. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్నవారు ఎవరూ అలా చేయరని వ్యాఖ్యానించారు. ‘సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లూ లేవు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు అంత భయపడుతున్నారు?’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
అధికార దుర్వినియోగం చేస్తున్నారు..
సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని, అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ దాఖలు చేయాలంటేనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
బాధితులపైనే కేసులు పెట్టారు…
పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి, బాధితులపైనే కేసులు నమోదు చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో తమ అభ్యర్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు.
