యాదవుల ఆత్మగౌరవానికి లోటు రానివ్వం..

  • సదర్‌ సమ్మేళనం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ
  • సదర్‌ నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశాం
  • యాదవులకు సముచిత స్థానం కల్పించాం : సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సదర్‌ సమ్మేళనం యాదవులకే పరిమితం కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. యాదవ సోదరులందరికీ సదర్‌ సమ్మేళన శుభాకాంక్షలు తెలిపారు.

సదర్‌ సమ్మేళన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల సహకారం ఎంతో ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవులు ఆదరించి, అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం గోల్కొండ కోటగా పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు గొల్లంకొండగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.

సదర్‌ను రాష్ట్ర పండుగగా ప్రకటించాం

గతంలో ఏ ముఖ్యమంత్రీ సదర్‌ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని సీఎం అన్నారు. యాదవుల ఆకాంక్షలను గుర్తించి తమ ప్రభుత్వం సదర్‌ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. వేడుకల నిర్వహణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో కులగణన నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచామని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ నమూనాను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా కులగణన చేపట్టామని పేర్కొన్నారు.

యాదవులకు సముచిత స్థానం

తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్‌ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని చెప్పారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించినట్లు గుర్తుచేశారు. యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి

దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు యాదవ సోదరులు సహకరించాలని సీఎం కోరారు. యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.