హైదరాబాద్‌ను నాలెడ్జ్, స్కిల్స్, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచం చూపు ప్రస్తుతం హైదరాబాద్ వైపే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా సీఎం పోస్టు పెట్టారు. పెట్టుబడులు, వ్యాపార రంగాలతో పాటు నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్, ఇన్నోవేషన్‌కు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ జరగనుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో యూకేకు చెందిన బిజినెస్ స్కూల్స్, యూనివర్సిటీల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. MIT, Purdue, University of London, Virginia Tech, Northeastern వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, గ్లోబల్ కంపెనీలు, అత్యాధునిక పరిశోధనలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంచడం ద్వారా తెలంగాణను గ్లోబల్ టాలెంట్‌కు వేదికగా మారుస్తామని వివరించారు.
ప్రపంచం వచ్చి నేర్చుకునే, ఆవిష్కరణలు చేసే, పెట్టుబడులు పెట్టే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు.
