Shivraj Singh Chauhan | పేదల సొంతింటి కల నెరవేరుస్తాం..
Shivraj Singh Chauhan | పేదల సొంతింటి కల నెరవేరుస్తాం..
3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 3 లక్షలు మంజూరు చేస్తాం
Shivraj Singh Chauhan | బుర్రిపాలెం, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ): గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో పేదల కోసం 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నది చంద్రబాబు సంకల్పమని అన్నారు.
చంద్రబాబు సంకల్ప బలం చాలా గొప్పదని కొనియాడిన ఆయన.. మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి శాశ్వత గృహం అందేలా చూడాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఇప్పటికే చౌహాన్ పేర్కొన్నారు.
3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చౌహాన్ అన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే ఈ విధానం భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ‘స్వర్ణాంధ్ర’ కోసం చంద్రబాబు చేస్తున్న ఆలోచనలు, ఆయన దూరదృష్టి ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. తాను ఒక పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అది పూర్తయ్యే వరకు చంద్రబాబు విశ్రమించరని చౌహాన్ అన్నారు.
చంద్రబాబు నేడు ఆలోచించే అంశాలను భవిష్యత్తులో దేశం ఆచరిస్తుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఏఐ డేటా కేంద్రాలు, క్వాంటమ్ సాంకేతికత వంటి రంగాల్లో ఏపీ ముందుకు సాగుతున్న తీరు చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారబోతోందని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణ ప్రణాళికలను చూసి తాను ఆశ్చర్యపోయానని, చంద్రబాబు ఆలోచనలతో అమరావతి భవిష్యత్తులో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చౌహాన్ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ అభివృద్ధి నమూనాను పరిశీలిస్తున్నాయని చెప్పారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూడా శివరాజ్‌సింగ్ చౌహాన్ విమర్శలు చేశారు. పేదల సొంతింటి కలను వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. తెనాలి ప్రతిభకు మారుపేరని పేర్కొన్న కేంద్ర మంత్రి.. తాను మధ్యప్రదేశ్‌కే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా మామయ్యనేనంటూ చమత్కరించారు.
