వీఆర్‌ఏలకు న్యాయం చేస్తాం: పొంగులేటి
61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల పునరుద్ధరణపై పరిశీలన
సాంకేతిక చిక్కులను అధిగమించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం
గత ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను రద్దు చేసి రెవెన్యూ రంగాన్ని దెబ్బతీసింది
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వీఆర్‌ఏలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్ధరాత్రి నిర్ణయాలతో వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను రద్దు చేసి రెవెన్యూ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి ఆరోపించారు. దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరిరక్షణతో పాటు ప్రజలకు సేవలందించిన రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏలపై దృష్టి
61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల పునరుద్ధరణ అంశంపై ప్రస్తుతం సాంకేతికపరమైన చిక్కులను పరిశీలిస్తున్నామని పొంగులేటి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వీఆర్‌ఏలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
