రీయింబర్స్‌మెంట్ బకాయి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
కళాశాలల యాజమాన్యాలకు కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ హామీ
బకాయిలు విడుదల చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలి
మెట్‌పల్లి, ఆంధ్రప్రభ: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ హామీ ఇచ్చారు. మెట్‌పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాలల నిర్వహణతో పాటు అధ్యాపకులు, సిబ్బంది జీతాల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఇంటర్మీడియట్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ స్పందిస్తూ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
