కాశిబుగ్గ( వరంగల్): వరంగల్ తూర్పు నియోజకవర్గం దేశాయిపేటలో వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన 200 డబుల్ బెడ్ రూములను వెంటనే పది రోజుల్లో వారికి అందించాలని లేనియెడల వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం దేశాయిపేట లోని బెడ్రూమ్ ల వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలుపుతూ.. పది రోజుల్లో డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో చేపడతామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ నిర్మించారని, ప్రస్తుత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాజకీయ కక్ష్యలతో జర్నలిస్టులను బలి చేస్తున్నారని, గూడు నీడకు దూరంగా ఉంటున్న జర్నలిస్టుల జీవితాలను ఇద్దరి మధ్య కక్ష్య సాధింపుతో బలిచేయొద్దని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇండ్ల నిర్మాణం చేశారన్నారు. కేంద్ర నిధులు దుర్వినియోగ పరుస్తున్నారని, మూడు ఏళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన కూడా పంపిణీ చేయడంలో పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పది రోజుల్లో డబుల్ బెడ్రూమ్ లు పంపిణీ చేయాలని గంట రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్, జర్నలిస్టు సంఘాలు వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
