తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది…
- పోలీసులపై కత్తితో దాడికి యత్నం..
- గాలిలోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గని నిందితుడు..
- హేమంత్‌తో పాటు గాయపడిన సీఐ వెంకటేశ్వర్లు..
- ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స
అనంతపురం క్రైమ్, ఆంధ్రప్రభ :
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు బాలికలపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. తొలుత గాలిలోకి కాల్పులు జరిపినా నిందితుడు వెనక్కి తగ్గలేదని, పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ జగదీశ్ వివరించారు.
నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయని ఎస్పీ తెలిపారు. పోలీసులను చూసిన హేమంత్ లొంగిపోకుండా కత్తితో సీఐ వెంకటేశ్వర్లుపై దాడికి యత్నించాడని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. నిందితుడితో పాటు గాయపడిన సీఐ వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
