ఏఐసీసీ ఒప్పుకోలేదు : టీపీసీసీ అధ్య‌క్షుడు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ లేదు!
మంత్రి పదవిపై నాకు సమాచారం లేదు: మహేష్‌ కుమార్‌ గౌడ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొండా సురేఖ వ్యవహారంపైనా పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను కాపాడేందుకు పార్టీ పరంగా తీవ్రంగా ప్రయత్నించామని, అయితే సురేఖ విషయంలో ఏఐసీసీ అంగీకరించలేదని తెలిపారు. ఆమె విష‌యంలో అధిష్ఠానం చాలా సీరియ‌స్‌గా ఉండి ఈ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రధానంగా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.

అలాగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్‌ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, ప్రస్తుతానికి విస్తరణ జరిగే అవకాశం లేదన్న సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయమని స్పష్టం చేశారు. హైకమాండ్‌ నుంచి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల్లో మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదని మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపైనే చర్చ జరిగినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన క్యాబినెట్‌ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన నిర్ణయం రాలేదన్న విషయం వెల్లడైంది.

మరోవైపు తనకు మంత్రి పదవి దక్కబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపైనా మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. తనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సంకేతాలు అందలేదని పేర్కొన్నారు.