కాంప్లెక్స్ షెటర్లను కిరాయికి ఇస్తాం

స్పందించిన కమ్మర్‌పల్లి ఎంపీడీవో
ఆంధ్రప్రభ ఎఫెక్ట్
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం కాంప్లెక్స్‌కు గ్రహణం పట్టింది. ఈ గ్రహణం వీడేది ఎన్నడని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన కాంప్లెక్స్ లు వాటి ఆలన, పాలనకు కరువడంతో చెత్తా చెదారం చేరి, చీమల పుట్టలు తయారై శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ కాంప్లెక్స్ లు అధికారులకు, సిబ్బంది వాహనాల పార్కింగ్‌లకే పరిమితమైంది. లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్‌లు ఖాళీగా దర్శనమిస్తూ… పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వినియోగంలోకి తీసుకురాకుండా కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ఏమిటి లాభమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆదివారం ఆంధ్రప్రభ వెబ్‌లో, ఆంధ్రప్రభ దిన పత్రిక జిల్లా సంచికలో ప్రచురితమైన కథనానికి మండల ప్రజా, పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ కమ్మర్ పల్లి షాపింగ్ కాంప్లెక్స్‌లో నాలుగు దుకాణాల కిరాయికి ఇవ్వడానికి ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గలవారు ఏదైనా దుకాణ సముదాయం ఏర్పాటు చేసుకోదలచినా, గోదాముల కొరకైనా అతి సరసమైన ధరలకు కిరాయికి ఇవ్వబడునని తెలిపారు. అడ్వాన్స్ గా ఒక దుకాణంకు రూ.10 వేలు, ఒక దుకాణం కు నెలకు రూ. 15 వందలకే కిరాయికి ఇవ్వబడునని తెలిపారు. ఆసక్తి గలవారు మండల ప్రజా పరిషత్ కార్యాలయం పని వేళలో సంప్రదించి దుకాణం కిరాయికి పొందగలరని ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ కోరారు.
