గంగకత్వకు పూర్వ వైభవం తీసుకురావాలి

ఇరిగేషన్ అధికారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
గంగకత్వకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఆధునీకరణ పనులు చేపట్టాలని, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని కాకుండా, రైతులకు మేలు జరిగేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

గంగకత్వ ఆధునీకరణ కోసం రూ.37 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జగ్గారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గంగకత్వ పరిధిలోని 11 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరడమే లక్ష్యంగా పనులు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు రూపకల్పనకు అనుగుణంగా పూడికతీత పనులు చేపట్టి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి ఇంకా ఏవైనా విజ్ఞప్తులు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుని, అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఆధునీకరణ పనులన్నీ పూర్తయితే సుమారు 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, గంగకత్వకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జగ్గారెడ్డి సూచించారు.