Minister Narayana | బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం..
Minister Narayana | బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం..
పుష్కరాల కోసం రూ.2 వేల కోట్లు
Minister Narayana | అమరావతి, అక్టోబర్ 3 (ఆంధ్రప్రభ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనంతరమే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
రాబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నారాయణ తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో ఒక్క రాజమండ్రి అభివృద్ధి పనులకే రూ.1,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ పుష్కరాల నిర్వహణకు అవసరమైన నిధులకు కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ కింద గతంలో మంజూరైన రూ.5,350 కోట్ల నిధులు వినియోగించుకోకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయని మంత్రి తెలిపారు. కేంద్రం సహకారంతో వాటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో రోడ్లు, ఘాట్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని నారాయణ తెలిపారు. 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి నిలిచిపోయిందని ఆయన విమర్శించారు.
