Water Supply-Hyd-Action Plan | వేసవి నీటి సరఫరాకు ముందస్తు కార్యాచరణ
Water Supply-Hyd-Action Plan | వేసవి నీటి సరఫరాకు ముందస్తు కార్యాచరణ
- సింగూరు–మంజీరా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులతో కాంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలి
- పవర్ బోర్‌వెల్స్‌కు 15 రోజుల్లో ఇన్‌ఛార్జ్‌ల నియామకం.. నీటి వృథా నియంత్రణపై ప్రత్యేక దృష్టి
- ట్రీటెడ్ వాటర్ వినియోగం పెంచాలి.. ప్రైవేట్ ఎస్టీపీలను కూడా మ్యాపింగ్ చేయాలి
- జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
Water Supply-Hyd-Action Plan | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న వేసవిలో హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత, ప్రాంతాల వారీగా డిమాండ్, పంపిణీ వ్యవస్థ, ప్రత్యామ్నాయ జలవనరులు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలను సమగ్రంగా విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేయగల ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
సింగూరు–మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాల్లో వేసవిలో నీటి సరఫరాపై ప్రభావం పడకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించేలా ప్రాంతాల వారీగా కాంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జేఎండీ మయాంక్ మిట్టల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేసవి నీటి సరఫరా సన్నద్ధత, సింగూరు–మంజీరా కాంటింజెన్సీ ప్లాన్, పవర్ బోర్‌వెల్స్ నిర్వహణ, ఫిల్లింగ్ స్టేషన్ల విస్తరణ, నెట్‌వర్క్ అనుసంధానం, పారిశ్రామిక–బల్క్ నీటి సరఫరా, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు.
సింగూరు–మంజీరా ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళిక
సింగూరు, మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాలని ఎండీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు ఏ ప్రత్యామ్నాయ జలవనరు నుంచి, ఏ మార్గంలో, ఎంత పరిమాణంలో నీటిని సరఫరా చేయవచ్చనే అంశాలతో స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమైన ఇంటర్‌కనెక్షన్లు, జంక్షన్లు, వాల్వ్ ఆపరేషన్లు, పైప్‌లైన్ అనుసంధానాలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. వేసవిలో అధిక నీటి అవసరం ఉండే ప్రాంతాలు, చివరి ప్రాంతాలు, తక్కువ ఒత్తిడితో నీరు అందుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట నెట్‌వర్క్ బలోపేతానికి సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
నీటి వృథాపై కఠిన చర్యలు
వేసవిలో నీటి డిమాండ్ పెరిగే నేపథ్యంలో నీటి వృథాను అరికట్టడం అత్యంత ప్రాధాన్య అంశమని ఎండీ అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిని అనవసరంగా వృథా చేయడం, గృహేతర అవసరాలకు వినియోగించడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నీటి వృథా చేస్తున్న వారికి మొదట అవగాహన కల్పించాలని, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే సమయంలో కేవలం నియంత్రణ చర్యలకే పరిమితం కాకుండా ప్రజల్లో నీటి సంరక్షణపై బాధ్యతాయుతమైన వినియోగ సంస్కృతిని పెంపొందించాలని తెలిపారు. నీటి పొదుపు పద్ధతులు, వేసవిలో నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న వనరుల పరిరక్షణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం పెంచాలి
వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవసరం పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యాన్ని సమీక్షించాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్లు ఎక్కువ దూరం ప్రయాణించకుండా నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఫిల్లింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, స్థలం, నీటి వనరు, మౌలిక సదుపాయాలు, వ్యయం, అమలు గడువుతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పవర్ బోర్‌వెల్స్‌కు ప్రత్యేక బాధ్యతలు
ప్రస్తుతం పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎండీ తెలిపారు. ప్రతి పవర్ బోర్‌వెల్‌కు 15 రోజుల్లోగా ఒక లైన్‌మెన్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ఆదేశించారు. బోర్‌వెల్ స్థానం, డివిజన్, ఇన్‌ఛార్జ్ వివరాలు, నీటి లభ్యత, పని చేసే సమయం, సరఫరా చేసే ప్రాంతాల వివరాలతో కేంద్రీకృత ఆన్‌లైన్ డేటాబేస్ రూపొందించాలని సూచించారు. ప్రతి బోర్‌వెల్‌కు అవసరానికి అనుగుణంగా ఆపరేషనల్ క్యాలెండర్ రూపొందించాలని, సాధారణ నీటి సరఫరా అందుబాటులో ఉన్న సమయంలో బోర్‌వెల్స్‌ను అనవసరంగా వినియోగించకుండా అత్యవసర అవసరాలకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పనిచేయని బోర్‌వెల్స్‌లో వేసవిలో ఉపయోగపడే వాటిని గుర్తించి ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని పెంచాలి
తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ వాటర్) గరిష్ఠంగా వినియోగించాలని ఎండీ సూచించారు. ల్యాండ్‌స్కేపింగ్, పార్కులు, నిర్మాణ రంగం, సెంట్రల్ మీడియన్లు, ఇతర గృహేతర అవసరాలకు ట్రీటెడ్ వాటర్‌ను మళ్లించాలని ఆదేశించారు.
జలమండలి ఆధ్వర్యంలోని ఎస్టీపీల వద్ద సాంకేతికంగా సాధ్యమైన ప్రాంతాల్లో ట్రీటెడ్ వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి విస్తరించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో ట్రీటెడ్ వాటర్ లభ్యత, అవసరమయ్యే ప్రాంతాలు, సరఫరా మార్గాలపై సోర్స్–డిమాండ్ మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు.
ప్రైవేట్ ఎస్టీపీల వివరాల సేకరణ
నగరంలోని ప్రైవేట్ ఎస్టీపీలను కూడా ట్రీటెడ్ వాటర్ వనరులుగా పరిగణించాలని ఎండీ ఆదేశించారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ సముదాయాలు, భారీ నివాస–వాణిజ్య ప్రాజెక్టుల్లో ఉన్న ఎస్టీపీలపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. వాటి సామర్థ్యం, రోజువారీ శుద్ధి చేసిన నీటి లభ్యత, నాణ్యత, ప్రస్తుతం వినియోగిస్తున్న విధానం వంటి వివరాలను ఆన్‌లైన్ డేటాబేస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లో ప్రైవేట్ ఎస్టీపీలకు సంబంధించిన పూర్తి మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.
పారిశ్రామిక సరఫరాపై ముందస్తు అంచనా
పారిశ్రామిక, బల్క్ వినియోగదారులకు అందిస్తున్న నీటి సరఫరాను కూడా సమీక్షించాలని ఎండీ ఆదేశించారు. సింగూరు–మంజీరా కాంటింజెన్సీ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే పారిశ్రామిక సరఫరాపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
అమలు చేయగల ప్రణాళికలు సిద్ధం చేయాలి
వేసవి సన్నద్ధతకు సంబంధించిన ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగేలా ఉండాలని ఎండీ స్పష్టం చేశారు. ప్రతి ప్రతిపాదనలో ప్రస్తుత పరిస్థితి, సమస్య, పరిష్కారం, చేపట్టాల్సిన పనులు, అంచనా వ్యయం, గడువు, బాధ్యత వహించే అధికారుల వివరాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తమ పరిధిలోని ప్రాంతాలను పరిశీలించి కాలపరిమితితో కూడిన వేసవి కాంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జలమండలి మల్కాజిగిరి ఈడీ పంకజ, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, సత్యనారాయణ, కిరణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, ట్రాన్స్‌మిషన్, ఐటీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
