తాగు నీటి కొరత లేనట్టే..
తిరుమల, ఆంధ్ర ప్రభ బ్యూరో (రాయలసీమ) : ఇటీవల వర్షాలతో తిరుమల కొండల్లోని జలశయాలు జలకళను సంతరించుకున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. తిరుమల నీటి అవసరాలను తీర్చడానికి పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తాజా వర్షాలతో కొండల్లో నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహంతో జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. ఇందులో2833 లక్షల గ్యాలన్ల సామర్ధ్యం కలిగిన గోగర్భం డ్యామ్ లో 2804 లక్షల నీళ్లు చేరడం తో పూర్తిగా నిండిపోయింది.
ఆ డ్యామ్ గేట్లలో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.5240 లక్షల గ్యాలన్ల సామర్ధ్యం నిల్వ గల పాపవినాశనం డ్యామ్ లో 4890.65 లక్షల గ్యాలన్లు, 685 లక్షల గ్యాలన్ల నిల్వ సామర్ధ్యం గల ఆకాశగంగ డ్యామ్ లో 537 లక్షల గ్యాలన్లు, 4258.98 లక్షల గ్యాలన్ల నిల్వ సామర్ధ్యం గల కుమారధార డ్యామ్ లో 3739.05 లక్షల గ్యాలన్లు, 1287.51 లక్షల గ్యాలన్ల నిల్వ సామర్ధ్యం కలిగిన పసుపు ధార డ్యామ్ లో 548.16 లక్షల గ్యాలన్లు చొప్పున నీళ్లు చేరాయని టీ టీ డి అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని చెబుతున్నారు. ఇక తిరుమల కొండల నుంచి తిరుపతి వైపు జాలు వారే కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

