వినాయక నిమజ్జనానికి నీటి తిప్పలు.. ఎండిన చెరువులతో భక్తుల అవస్థలు
ఏపీలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావం..
ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల ఇబ్బందులు
ఆంధ్రప్రభ, చిత్తూరు: వినాయక నిమజ్జనానికి నీటి కొరత భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో గణేశ్ నవరాత్రుల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులు నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. చేసేదేమీ లేక కొందరు భక్తులు ‘క్షమించు దేవుడా’ అంటూ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అక్కడే వదిలేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గణేశ్ నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేయలేని పరిస్థితి రావడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయంగా నిమజ్జనానికి నీటి సదుపాయం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
