ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల
తాగునీటికే సీఎం చంద్రబాబు తొలి ప్రాధాన్యత: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు శనివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ శబరి పేర్కొన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వేసవితో పాటు అవసరమైన సమయాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ శబరి అన్నారు. తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలకు కూడా ఈ నీటి విడుదల కొంతమేర ఉపశమనం కలిగించనుందని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.
