TG | జలసౌధలో కొలువుల పండుగ..

హైదరాబాద్ : నగరంలోని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో కొత్తగా నియమితులైన AEలు మరియు JTOలు (నీటిపారుదల శాఖ) నియామక లేఖల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్: నగరంలోని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో భారీగా కొలువుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా, నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్స్ (AE), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO)లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. యువ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న మీ అందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నీటి కోసం ప్రారంభమైందని, ఈ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల అతిపెద్ద సెంటిమెంట్ నీరు..

ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగానికి ప్రతినిధులు మీరు అని ముఖ్యమంత్రి అన్నారు. మీ భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి అని విమర్శించారు.

2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. “ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు? ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?” అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి, ఈ అంశంపై మేధావులు, ఉద్యోగులు ఆలోచన చేయాలని సూచించారు.

నీటిపారుదల శాఖలో ఖాళీలను భర్తీ చేసి, ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేసిన‌ట్టు తెలిపారు.

ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారు.. గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి అని విమ‌ర్శించారు.

లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. అందుకే ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి, రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి అని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు అని.. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి రేవంత్ రెడ్డి తెలిపారు. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే అని అన్నారు. కాగా, మ‌ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకొని పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే, గ్రూప్ వన్ నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply