కొడంగల్‌కు నీళ్లే ప్రాధాన్యం.. ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ పనులకు వేగం

  • ఫేజ్‌-2 టెండర్లను త్వరగా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  • ఫేజ్‌-1 డిసెంబర్‌ 2027, ఫేజ్‌-2 అక్టోబర్‌ 2028 నాటికి పూర్తి చేయాలి..
  • తండాలకు రోడ్డు కనెక్టివిటీపై స్పష్టమైన ఆదేశాలు

కొడంగల్‌, ఆంధ్రప్రభ: మక్తల్‌–నారాయణపేట్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ఫేజ్‌-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన బడ్జెట్‌పై ప్రతి ఏడాది పూర్తి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్టు పంప్‌హౌస్‌ పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రాజెక్టు ఫేజ్‌-1 పనులను డిసెంబర్‌ 2027 నాటికి, ఫేజ్‌-2 పనులను అక్టోబర్‌ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రోడ్లు, వంతెనలపైనా ఆరా

కొడంగల్‌ నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. రోడ్డు కనెక్టివిటీ, భవన నిర్మాణాలు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తండాలకు రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామాల్లోని వాగుల వద్ద కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాగుల వద్ద నీటి ప్రవాహానికి అనుగుణంగా, చెక్‌డ్యామ్‌ల తరహాలో ఉపయోగపడే విధంగా వంతెనల డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.