నీటి పొదుపే.. భవిష్యత్‌కు భరోసా
- వచ్చే ఏడు నెలలు తాగునీటి కొరతపై అప్రమత్తంగా ఉండాలి
- సింగూరు జలాశయంలో 29 టీఎంసీలకు 3 టీఎంసీలే.. వృథాను అరికట్టాలి
- అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా చర్యలు చేపట్టాలి: జగ్గారెడ్డి
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: రానున్న ఏడు నెలలు తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు అధికారులు కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాగునీరు, విద్యుత్ సమస్యలపై విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం సుమారు 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు తెలిపారన్నారు. వచ్చే వర్షాలు కురిసే వరకు మంజీరా, సింగూరు నీటిని తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. నీటి లభ్యతకు అనుగుణంగానే వినియోగం ఉండాలని, నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు నాలుగు మండలాల గ్రామాల్లో నీటి పొదుపుపై మైక్‌లు, పాంప్లెట్ల ద్వారా ఇంటింటా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లలో అవసరం లేనప్పుడు నల్లాలు మూసివేయాలని, మోటార్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు టైమర్ స్టార్టర్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అవసరమైతే మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో ప్రెషర్ పెంచి సరఫరాను మెరుగుపరచాలని, పశువులకు సైతం తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ బ్రేక్‌డౌన్ల కారణంగా మోటార్లు దెబ్బతింటున్న సమస్యపై కూడా సమీక్షించారు. దీనిపై వచ్చే మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగూరు నుంచి ఇటీవల నీటిని విడుదల చేసిన అంశంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే మరమ్మతుల కోసం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
రాహుల్ పోరాటానికి మద్దతుగా ఉద్యమం
కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ ఆందోళన చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రజల కోసం రాహుల్ గాంధీ రోడ్డెక్కి పోరాడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి వేదికగా చేపట్టనున్న పోరాట కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
