ఉమ్మడి వరంగల్‌లో ఫామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు..
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫామ్‌ ఆయిల్‌ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తక్షణమే జిల్లాలో ఫామ్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంట మార్పిడిపై రైతులకు కల్పిస్తున్న అవగాహనతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు వరి, పత్తి వంటి పంటలకు బదులుగా ఫామ్‌ ఆయిల్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో గణనీయంగా ఫామ్‌ ఆయిల్‌ సాగు జరుగుతోందని, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఫామ్‌ ఆయిల్‌ గెలలను నరికిన వెంటనే, 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెసింగ్‌ చేయాల్సి ఉంటుందని కడియం శ్రీహరి వివరించారు. సమయం దాటితే పంట నాణ్యత తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.

కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఫామ్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కడియం శ్రీహరి కోరారు.