Wall papers | విశ్వ గురువు భారతదేశం..

Wall papers | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసి విశ్వ గురువుగా భారతదేశం రాణిస్తున్న వేళ యోగ విశిష్టతను బహుళ ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తూ.. బృహత్తర కార్యక్రమంలో 44 వ జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025 ను జయప్రదం చేయాలని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద 44వ జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్ గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 16 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్లు 600 మంది ఈ జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని రాష్ట్ర యువజన క్రీడా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారని తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఈ ఛాంపియన్షిప్ నిర్వహించే అవకాశం లభించిందని ఈ పోటీలకు బాపట్ల నియోజకవర్గంలో వేదిక కానుండటం హర్షణీయమని అన్నారు. బాపట్ల మండలం జిల్లెళ్ళమూడి విశ్వజననీ పరిషత్ ప్రాంగణంలో మూడు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా జిల్లెళ్ళమూడిలో ఏర్పాటు చేయనున్నట్లు గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి రోడ్లను పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఏపీ యోగా అసోసియేషన్ చైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్ళం హరినాథ్ రెడ్డి, కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళి కృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయులు వీరభద్రరావు, ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
