గాంధీ బాటలో నడవడమే దేశ భవిష్యత్తు

మాజీ శాసన మండల చైర్మన్ అహ్మద్‌ షరీఫ్‌

విజయవాడ, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని మాజీ శాసనమండలి చైర్మన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు అహ్మద్‌ షరీఫ్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ ఫతావుల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అహ్మద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ పుత్లీబాయి, కరంచంద్‌ గాంధీ దంపతులకు జన్మించిన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. 1915లో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని సత్యం, అహింస, స్వదేశీ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు.

1919 ఏప్రిల్‌లో విజయవాడకు వచ్చిన గాంధీజీ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు చైతన్యపరిచారని గుర్తుచేశారు. గాంధీజీ సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని, ఆయన చూపిన మార్గంలో నడవడమే దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అహ్మద్‌ షరీఫ్‌ అన్నారు. కార్యక్రమానికి మొహమ్మద్‌ ఫతావుల్లా అధ్యక్షత వహించారు.