హైదరాబాద్ : భారతదేశంలోని పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరచే లక్ష్యంతో, వాఘ్ బక్రీ ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేసిన 9 డెలివరీ వాహనాలను అక్షయ పాత్ర ఫౌండేషన్’కు అందించింది. ఈ వాహనాల ద్వారా హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాలలో 205+ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో 10,500 మంది పిల్లలకు భోజనాన్ని సమయానికి అందించనున్నారు.
ఈ కొత్త ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలను తెలుగు టెలివిజన్ ప్రముఖురాలు సుమ కనకాల, వాఘ్ బక్రీ టీ గ్రూప్ సీఈఓ సంజయ్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోగేశ్ శిండే, దక్షిణ విభాగం అధిపతి పీవీ సురేష్, కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం (CSR) అధిపతి అజయ్ సిసిలియా, అక్షయ పాత్ర ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ యాగ్నేశ్వర్ దాస్ సంయుక్తంగా ప్రారంభించారు.
ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ రోజుకు తెలంగాణలో 1,76,073 భోజనాలు, ఆంధ్రప్రదేశ్‌లో 1,44,732 భోజనాలు అందిస్తోంది. అక్షయ పాత్ర రోజుకు 22.5 లక్షల మంది పిల్లలకు భోజనం అందించే కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఈ వాహనాలు సహాయపడతాయి.