ఆధునిక వంటగదుల కోసం ‘ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి’

సంప్రదాయ ఆహార ఉత్పత్తుల విభాగంలోకి వి-రిచ్‌ విస్తరణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆధునిక భారతీయ క్లీన్‌-లేబుల్‌ ఆహార బ్రాండ్‌ వి-రిచ్‌ ‘ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి’ని హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. సమయం లేక ఇబ్బంది పడే ఉద్యోగులు, బిజీగా ఉండే కుటుంబాల కోసం దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. సంప్రదాయ వంటల రుచిని ఆధునిక జీవనశైలికి అనుగుణంగా సులభంగా అందించడమే ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. భారతీయ వంటల్లో తాలింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోపు దినుసులను సిద్ధం చేయడం, నూనె చిమ్మడం, వంట తర్వాత శుభ్రం చేసుకోవడం వంటి ఇబ్బందులు లేకుండా దీన్ని రూపొందించినట్లు తెలిపింది.

స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించిన పోపు దినుసుల సువాసనను ఈ ఉత్పత్తిలో పదిలపరిచినట్లు సంస్థ వెల్లడించింది. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వంటి ఏడు రకాల పోపు దినుసులు ఇందులో ఉంటాయని తెలిపింది. ఒక చెంచా నెయ్యిని వేడి చేసి పప్పు, అన్నం, కిచిడీ, ఉప్మా లేదా కూరల్లో కలిపితే తాలింపు రుచి, సువాసన అందుతాయని పేర్కొంది. రసాయన రుచులు, కృత్రిమ సంరక్షణ పదార్థాలు లేకుండా స్వచ్ఛమైన నెయ్యి, అసలైన పోపు దినుసులతో తయారు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ ఆవిష్కరణపై వి-రిచ్‌ వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగితా జాహ్నవి మాట్లాడుతూ వంటలో తాలింపు ఎంతో ముఖ్యమైన భాగమన్నారు. సమయం లేకపోవడం వల్ల సంప్రదాయ రుచిని వదులుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఆలోచనతో ఇన్‌స్టంట్‌ తడ్కా నెయ్యిని రూపొందించినట్లు తెలిపారు. అన్ని దినుసులను ఒకచోట చేర్చి, మాడకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తాలింపు వేయడం బిజీ జీవనశైలిలో కష్టమవుతోందని, ఈ ప్రక్రియను సులభతరం చేశామని వివరించారు. భారతీయ వంటింటి సంప్రదాయ పద్ధతులను ఆధారంగా చేసుకుని, అధికంగా ప్రాసెస్‌ చేసిన పదార్థాలు లేకుండా భోజనానికి రుచిని అందించడమే ఉత్పత్తి ఉద్దేశమని పేర్కొన్నారు.

ఆధునిక జీవనశైలికి సంప్రదాయ రుచులను సులభంగా పరిచయం చేసే దిశగా ఇన్‌స్టంట్‌ తడ్కా నెయ్యి తమ వ్యూహాత్మక విస్తరణలో భాగమని వి-రిచ్‌ తెలిపింది. అశ్వగంధ, శతావరి, పసుపుతో కూడిన నెయ్యి, అల్లం, పసుపు, ఇమ్యూనిటీ తేనె తదితర సహజ ఉత్పత్తులు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. 250 మిల్లీలీటర్ల ఇన్‌స్టంట్‌ తడ్కా నెయ్యి జార్‌ ధర రూ.449గా నిర్ణయించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా, హైదరాబాద్‌లో బ్లింకిట్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చని తెలిపింది. త్వరలో ఇతర ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.

వి-రిచ్‌ హైదరాబాద్‌కు చెందిన క్లీన్‌-లేబుల్‌ ఆహార బ్రాండ్‌. రోజువారీ భోజనంలో సహజమైన ఆహారాన్ని సులభంగా భాగం చేయాలనే లక్ష్యంతో సంప్రదాయ ఆహార పద్ధతులను ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పాలు, సంప్రదాయ నెయ్యి, ఇన్‌స్టంట్‌ తడ్కా నెయ్యితో పాటు వివిధ ఆయుర్వేద మిశ్రమ నెయ్యి, తేనె ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది.