విజయనగరం జలమయం
పలుచోట్ల నీట మునిగిన వరి పంటలు.. కొట్టుకుపోయిన కల్వర్టు
విద్యాసంస్థలకు సెలవు
విజయనగరం, ఆంధ్రప్రభ: ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన కుండపోత బుధవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు మండలాల్లో వరి పంటలు నీటమునిగాయి.

భోగాపురం మండలం జమ్మయ్యపేట సమీపంలో వరద ఉద్ధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సవరవిల్లి–కవులవాడ, పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీరుపేట వద్ద రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పూసపాటిరేగ మండలంలో జాతీయ రహదారి-16 నుంచి కామవరం మీదుగా కనిమెళ్ల వెళ్లే మార్గంలోని కాజ్‌వేపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది.

జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
