Lorry Accident | కలెక్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని దెబ్బతిన్న కారు

Lorry Accident | విజయనగరం, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆర్నాబ్‌ తుపాను నేపథ్యంలో బుధవారం పెద్దగడ్డ వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పారాది వంతెన వద్ద పరిస్థితిని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించి విజయనగరం తిరిగి వస్తుండగా బూసాయవలస పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ బంక్‌ వైపు నుంచి ఎదురుగా వచ్చిన లారీ కలెక్టర్‌ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు ఎడమవైపు పూర్తిగా దెబ్బతింది. అయితే కలెక్టర్‌తోపాటు కారులో ఉన్న డ్రైవర్‌ కృష్ణ, సీసీ, గన్‌మెన్‌, డఫేదార్‌ రమేష్‌, సమాచార శాఖ వీడియోగ్రాఫర్‌ సన్యాసినాయుడుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం అనంతరం లారీని ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను సిబ్బంది వెంబడించారు. రాంభద్రపురం, కొట్టక్కి చెక్‌పోస్టుల వద్ద ఆగకుండా వెళ్లిన లారీ డ్రైవర్‌ చివరకు పీకోనవలస చెక్‌పోస్టు సమీపంలో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.