Visakhapatnam Steel Plant Safety Concerns | తగ్గుతున్న శాశ్వత ఉద్యోగులు, పెరుగుతున్న భద్రతా ఆందోళనలు

Visakhapatnam Steel Plant Safety Concerns | తగ్గుతున్న శాశ్వత ఉద్యోగులు, పెరుగుతున్న భద్రతా ఆందోళనలు

Visakhapatnam Steel Plant Safety Concerns | వీఆర్ఎస్‌లతో తగ్గుతున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు
కాంట్రాక్టు కార్మికులపై పెరుగుతున్న ఆధారపడటం
స్టీల్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలపై కార్మిక సంఘాల ఆందోళన
భద్రతా శిక్షణ, సేఫ్టీ ఆడిట్లపై నిపుణుల కీలక సూచనలు

Visakhapatnam Steel Plant Safety Concerns | విశాఖపట్నం-ఆంధ్రప్రభ భ్యూరో : విశాఖ ఉక్కు క్రమేపీ ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. అయితే గతంలో కూడా ప్రమాదాలు జరిగినప్పటికి భవిష్యత్తును తలచుకుంటేనే మరింత భయానక వాతావరణం అలముకుందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్లో ఎంతో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రయివేటు కార్మికులు ఉండేవారు. అయితే వారి అనుభవం అంతా ఉపయోగించడంతో పెద్దగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండేవి కావు. కాని విశాఖ స్టీల్ ప్లాంట్ను 2021 జనవరి 27న ప్రయివేటీకరణ దిశగా నడిపించడం ప్రారంభించారు. అదే రోజున కేంద్రం ఉక్కులో వందశాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఇక అక్కడ నుంచి ఉద్యోగుల స్వచ్చంద పదవీవిరమణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలివిడత విఆర్ఎస్లో మార్చి 31, 2025న ఏకంగా 1137 మంది ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక రెండోదశ విఆర్ఎస్ సెప్టెంబర్ 30, 2025న మరో 464 మంది ఉద్యోగులు సెలవు తీసుకున్నారు. ఇక ఆ తరువాత మూడోదశ విఆర్ఎస్లో భాగంగా 2026, మార్చి 3న మరో 67 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీవిరమణ తీసుకున్నారు. ఇలా అనేక మంది అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం

అనుభవం ఉన్న వారి కంటే లేనివారే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం సుమారు 2500 మంది అధికారులు ఉండగా మరో 7000 మంది వరకు కార్మికులున్నారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల సంగతి పక్కన పెడితే కొద్దిరోజుల క్రితమే సుమారు 5వేల మందిని తొలగించారు. వారి స్థానంలో ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీష్ ఘడ్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని నియమించుకోవడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఉక్కులో అనుభవంలేని వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. తక్కువ వేతనంకే బయట ప్రాంతాలకు చెందిన కార్మికులను కాంట్రాక్టర్లు విదుల్లోకి తీసుకుంటున్నారు. అందువల్లే శాశ్వత ఉద్యోగులు ఉండాల్సిన చోట సైతం విదుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉంటున్నారు. దీని వల్ల ప్రమాదాలకు ఉక్కులో అధికంగా అవకాశాలు చోటు చేసుకుంటున్నాయి.

2012లో ఎస్ఎమ్ఎస్ విభాగంలో భీకర ప్రమాదం చోటు చేసుకోగా అప్పట్లో 19 మందికి పైగా మృతి చెందారు. తాజాగా అదే ఎస్ఎమ్ఎస్-2లో ఇప్పుడు ఏకంగా 8 మంది మృతి చెందారు. అయితే అనుభవంలేని కాంట్రాక్ట్ కార్మికులను అధికంగా ఉపయోగిస్తుండడం వల్ల భవిష్యత్తులో కూడా జరగరాని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తగ్గుతున్న శాశ్వత ఉద్యోగులుపెరుగుతున్న పని భారం

ఆందోళనలో కార్మిక సంఘాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండగా, కాంట్రాక్టు కార్మికులపై ఆధారపడటం పెరుగుతోందనే ఆందోళన కార్మిక సంఘాల్లో వ్యక్తమవుతోంది. గత దశాబ్ద కాలంలో పదవీ విరమణలు, కొత్త నియామకాల కొరత కారణంగా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వేల సంఖ్యలో శాశ్వత ఉద్యోగులతో నడిచిన కీలక విభాగాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులే అధికంగా పనిచేస్తున్నారని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్టీల్ మెల్టింగ్ షాప్, బ్లాస్ట్ ఫర్నేస్, కోక్ ఓవెన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి అధిక ప్రమాదకర విభాగాల్లో అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల కొరత కనిపిస్తోందని అంటున్నారు. కార్మిక సంఘాల అభిప్రాయం ప్రకారం, కాంట్రాక్టు కార్మికులు కూడా నైపుణ్యం కలిగిన వారే అయినప్పటికీ, తరచూ మారే సిబ్బంది, తక్కువ అనుభవం, భద్రతా శిక్షణలో వ్యత్యాసాలు వంటి అంశాలు ప్రమాద అవకాశాలను పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ప్రమాదాలకు కాంట్రాక్టు ఉద్యోగులే ప్రత్యక్ష కారణమని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విచారణ నివేదికలు లేవు. ఇటీవల జరిగిన గ్యాస్ లీక్లు, మోల్టెన్ మెటల్ ప్రమాదాలు, గతంలో జరిగిన ఆక్సిజన్ ప్లాంటే పేలుడు వంటి ఘటనల అనంతరం భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత, నిర్వహణ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గడం వల్ల మిగిలిన సిబ్బందిపై పని భారం పెరుగుతోందని, ఇది కూడా భద్రతా సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉక్కు పరిశ్రమల వంటి అధిక ప్రమాదకర రంగాల్లో ఉద్యోగి శాశ్వతమా, కాంట్రాక్టా అనేది కంటే సరైన శిక్షణ, అనుభవం, భద్రతా పరికరాలు, పర్యవేక్షణ, నిరంతర సేఫ్టీ ఆడిట్లు కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలంటే ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా అంతర్జాతీయ ప్రమాణాల భద్రతా శిక్షణ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాల నేపథ్యంలో భద్రతా వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి, శాశ్వత ఉద్యోగుల నియామకాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఐఎన్ఎల్ యాజమాన్యం దృష్టి సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply