Vizag-Steel-Plant-Accident : సమగ్ర నివేదిక ఇవ్వండి Andhra Prabha Top News
Vizag-Steel-Plant-Accident : సమగ్ర నివేదిక ఇవ్వండి Andhra Prabha Top News
- బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
- పర్మినెంట్.. ఔట్ సోర్సింగ్ తేడా లేదు
- కార్మికుల పిల్లల్ని చదివిస్తాం
- విశాఖలో ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి
( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో)

Vizag-Steel-Plant-Accident : విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటన జరిగిన తీరు, భద్రత చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆదేశించారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి ప్రమాద స్థలికి చేరుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖ పార్లమెంట్ సభ్యులు మత్తుకుమిల్లి భరత్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కలిసి క్షతగాత్రులను, బాధితులను పరామర్శించారు.

Vizag-Steel-Plant-Accident : అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కుమార స్వామి వివరించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఆర్‌అండ్‌ఎల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన విషాదకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల మరణం పట్ల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ ఘటనతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్న మంత్రి, ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దుర్ఘటన కారణంగా పునరుద్ధరణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి, వారు రెగ్యులర్ ఉద్యోగులైనా లేదా ఔట్‌సోర్సింగ్ సిబ్బందైనా, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది వారికి లభించే బీమా, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా మృతుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే కొనసాగేందుకు అనుమతి ఇస్తామని, కార్మికుల పిల్లలకు పూర్తి ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు,.
ప్రతి బాధిత కుటుంబానికి ఒకరికి శాశ్వత ఉద్యోగం అందించబడుతుంది.
ఈ నిర్ణయం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది.
కుటుంబాల భవిష్యత్ భద్రత కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఇతర ఉక్కు కర్మాగారాల నిపుణులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని నియమించినట్లు కుమారస్వామి వెల్లడించారు. కమిటీ సభ్యులు మంగళవారం విశాఖకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక సమర్పిస్తారని తెలిపారు.

విశాఖ ఉక్కు కర్మాగార అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి పునరుద్ఘాటించారు.
ALSO READ : Vizag Steel Plant | భారీ ప్రమాదం.. 8మంది మృతి
