జపాన్ పార్లమెంట్‌ భవనం సందర్శించిన విష్ణువర్ధన్‌రెడ్డి..

  • నేతాజీ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం..
  • భారత్‌–జపాన్‌ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో : జపాన్‌ పర్యటనలో భాగంగా చారిత్రక నేషనల్‌ డైట్‌ (పార్లమెంట్‌) భవనాన్ని సందర్శించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని బీజేపీ జాతీయ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 1890లో ప్రారంభమైన జపాన్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణానికి నేషనల్‌ డైట్‌ భవనం సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ భవనాన్ని సందర్శించడం ద్వారా జపాన్‌ చరిత్ర, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకునే అవకాశం లభించిందన్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆజాద్‌ హింద్‌ ఉద్యమానికి జపాన్‌ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీతో పాటు ఎంతోమంది చేసిన త్యాగాలు, పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. నేతాజీ దేశభక్తి, ధైర్యం, అంకితభావం ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

భారత్‌, జపాన్‌ దేశాల మధ్య ఉన్న చారిత్రక స్నేహబంధం, పరస్పర గౌరవం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని విష్ణువర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ప్రజల స్థాయిలోనే కాకుండా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లోనూ సంబంధాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్‌ పర్యటనలో నేషనల్‌ డైట్‌ భవనాన్ని సందర్శించే అవకాశం కల్పించిన భారత రాయబార కార్యాలయ అధికారులకు, తన మిత్రుడు రాజనీష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.