పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ

సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రతకు ఆదేశాలు..
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఎన్నికల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.

జె.ఆర్.పురం, ఫరీదుపేట, ఒప్పంగి, గార తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల క్యూలైన్ల నిర్వహణ, పోలీసు బందోబస్తు తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం ఐజీ గోపీనాథ్ జట్టి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రేంజ్ పరిధితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మిగిలిన పోలింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని వెల్లడించారు.

ఈ పర్యటనలో జె.ఆర్.పురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అవతారం, సీఐ కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.