Viral Video |ఈ వీడియో చూస్తే మనసు కదిలిపోతుంది!

సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: కొన్ని దృశ్యాలు కళ్లతో చూసినా.. మనసు మాత్రం వాటిని చాలా సేపు మర్చిపోదు. అలాంటి ఓ హృదయాన్ని హత్తుకునే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన గోవులకు సంబంధించిన ఈ వీడియో మనసులను కదిలిస్తోంది.

ఈ వీడియోలో ఓ చిన్న దూడ.. పాల వ్యాన్‌పై ఏర్పాటు చేసిన త్రీడీ బొమ్మను తన తల్లి అనుకుని దాని దగ్గరకు వెళ్లి.. అమాయకంగా పాలు తాగేందుకు ప్రయత్నించిన తీరు చూస్తే.. ఎవరికైనా గుండె బరువెక్కక మానదు. తల్లి కనిపించిందన్న ఆనందంతో ఆ బొమ్మ చుట్టూ తిరుగుతూ, తనకు పాలు ఇస్తుందేమోనని ప్రయత్నించిన దూడను చూస్తుంటే.. ఆ అమాయకత్వానికి మాటలు సరిపోవు. కొద్దిసేపటి తర్వాత అది నిజమైన ఆవు కాదని గ్రహించినట్టుగా కనిపించడం మరింత కలచివేస్తోంది. పాలు లేవని తెలిసినా.. తల్లి కోసం దాని చూపుల్లో కనిపించిన ఆరాటం భావోద్వేగానికి గురిచేస్తోంది.

తల్లి అంటే ఏంటో మాటల్లో చెప్పలేని ఆ చిన్న దూడ.. తన అమాయకమైన ప్రవర్తనతో మాత్రం అందరికీ అర్థమయ్యేలా చేసింది. నిజమైన తల్లి కోసం వెతికిన ఆ చిన్నారి కళ్లలోని ఆ భావాన్ని చూస్తే.. మనసున్న ప్రతి ఒక్కరికీ ఒక్క క్షణం కన్నీళ్లు ఆగవు. ఈ వీడియో కేరళంలోని ఓ ప్రాంతానికి చెందినట్లుగా తెలుస్తోంది.