Viral Video |సోషల్‌ మీడియాలో పింక్‌ డాల్ఫిన్‌ వైరల్‌ వీడియో

మస్కట్‌,ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ఒమన్‌ రాజధాని మస్కట్‌ తీరంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా బూడిద రంగులో కనిపించే డాల్ఫిన్‌ల మధ్య గులాబీ రంగులో ఉన్న ఓ డాల్ఫిన్‌ సముద్రంలో ఈదుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

వైరల్‌గా మారిన వీడియో

మస్కట్‌ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో కొన్ని డాల్ఫిన్‌లు కలిసి ఈదుతుండగా, వాటి మధ్య గులాబీ రంగులో కనిపించిన డాల్ఫిన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఈ అరుదైన జీవిపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీడియోలో కనిపించిన డాల్ఫిన్‌ జాతిని సముద్ర నిపుణులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.

గులాబీ రంగులో కనిపించే డాల్ఫిన్‌ల గురించి చెప్పగానే చాలామందికి అమెజాన్‌ నది డాల్ఫిన్‌ గుర్తుకొస్తుంది. ఇవి దక్షిణ అమెరికాలోని మంచినీటి నదుల్లో నివసిస్తాయి. కొన్ని ఇండో-పసిఫిక్‌ హంప్‌బ్యాక్‌ డాల్ఫిన్‌లు వయసు పెరిగే కొద్దీ లేత రంగులోకి మారవచ్చు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌ తీర ప్రాంతాల్లో కనిపించే కొన్ని డాల్ఫిన్‌లలో ఈ లక్షణం గమనించవచ్చు. వాటి చర్మం పలుచగా ఉండటం, చర్మానికి దగ్గరగా ఉండే రక్తనాళాలు కనిపించడం వల్ల గులాబీ రంగు ఛాయ ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.