Viral Video | 9 ఏళ్ల తర్వాత.. కెమెరాకు చిక్కిన అరుదైన చేప!

  • పారదర్శకమైన తల.. ఆకుపచ్చ కళ్లు
  • ఆరు అంగుళాల పొడవున్న బారెల్‌ఐ చేప
  • సముద్ర గర్భంలో 1,970 అడుగుల లోతులో గుర్తింపు
  • 20 నిమిషాల పాటు పరిశీలించిన శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌, ఆంధ్రప్రభ వెబ్‌: సముద్ర గర్భంలో ఎన్నో వింత జీవులు నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని అత్యంత అరుదుగా మాత్రమే మనుషుల కంటికి కనిపిస్తాయి. అలాంటి ఓ అద్భుతమైన సముద్ర జీవికి సంబంధించిన అరుదైన దృశ్యాలను శాస్త్రవేత్తలు తాజాగా 4కే కెమోరాలో రికార్డ్ చేశారు. ట్రన్స్‌పరెంట్‌గా ఉండే తల, గుండ్రంగా ఉబ్బిన తలతో ఉన్నశరీర నిర్మాణం, అసాధారణమైన గ్రీన్‌ కలర్‌ కళ్లతో కనిపించే ఈ చేప పేరు బారెల్‌ఐ. సముద్ర గర్భంలో తేలియాడుతున్న ఈ వింత చేప దృశ్యాలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అమెరికాలోని మాంటెరీ బే అక్వేరియం రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు పసిఫిక్‌ మహాసముద్రంలో చేపట్టిన పరిశోధన యాత్రలో ఈ చేపను గుర్తించారు. మాంటెరీ కాన్యన్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఈ అరుదైన జీవి కనిపించింది. అక్టోబర్‌ 22న డాక్‌ రికెట్స్‌ అనే రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌ (ROV) సాయంతో సుమారు 1,970 అడుగుల లోతులో దీన్ని చిత్రీకరించారు.

లోతైన సముద్ర జీవులను గుర్తించడం, వాటి వివరాలను నమోదు చేయడం, అవసరమైన నమూనాలను సేకరించడం లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు డేవిడ్‌ ప్యాకార్డ్‌ అనే పరిశోధన నౌకను ఉపయోగించారు. దాదాపు ఆరు అంగుళాల పొడవున్న ఈ చేపను పరిశోధకులు 20 నిమిషాల పాటు నిశితంగా పరిశీలించారు. అత్యాధునిక 4కే కెమెరాలతో దాని కదలికలను చిత్రీకరించారు.

పారదర్శకమైన తలే ప్రత్యేక ఆకర్షణ..

ఈ చేప శాస్త్రీయ నామం మాక్రోపిన్నా మైక్రోస్టోమా. దీని తల ట్రన్స్‌పరెంట్‌గా ఉండటంతో తల లోపల ఉన్న ఆకుపచ్చ కళ్లను బయట నుంచి స్పష్టంగా చూడవచ్చు. సాధారణ చేపల మాదిరిగా కాకుండా దీని కళ్ల నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా 2,000 నుంచి 2,600 అడుగుల లోతులో కనిపిస్తుంది. సముద్రపు లోతుల్లో వెలుతురు చాలా తక్కువగా ఉండటంతో ఇలాంటి జీవులను గుర్తించడం పరిశోధకులకు సవాలుగా మారుతుంది.

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ కెమెరాకు చిక్కింది..

ఈ అరుదైన చేపను పరిశీలించిన యాత్ర సీనియర్‌ శాస్త్రవేత్త స్టీవెన్‌ హాడాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను కొన్ని సందర్భాల్లో బారెల్‌ఐ చేపను చూసినప్పటికీ, ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనా వాహనాలకు 4కే కెమెరాలు అమర్చడానికి ముందు చివరిసారిగా చూశానని తెలిపారు. అంటే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ చేపను ఇంత స్పష్టంగా పరిశీలించే అవకాశం లభించిందని వివరించారు.

ఈ చేపను చూస్తే ఊహాశక్తి ఉన్న చిన్నారి సృష్టించిన జీవిలా అనిపిస్తుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సముద్ర గర్భంలో ఇంకా ఎన్నో అద్భుతమైన జీవులు ఉన్నాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటి రహస్యాలను తెలుసుకునే అవకాశం పెరుగుతోందని ఈ పరిశోధన మరోసారి చాటిచెబుతోంది.