Viral Video | సరిహద్దులు దాటిన రామాయణ క్రేజ్‌!

సోషల్‌ మీడియాలో చెక్కర్లుకొడుతున్న వీడియో

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి : సిల్వర్‌ స్ర్కీన్‌పై రాముడి కథను చూసేందుకు భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఆ సారి ఆ ఆసక్తి పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ కనిపించింది. బాలీవుడ్ లో అత్యంత హై బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమాపై కరాచీలోని హిందూ సమాజం ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. సినిమా పోస్టర్‌ను ఆలయంలో ప్రదర్శిస్తూ.. ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

భారతీయ ఇతిహాసాల ప్రభావం భౌగోళిక సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని మరోసారి గుర్తుచేస్తూ.. కరాచీలోని హిందూ సమాజం ‘రామాయణ’ సినిమా పట్ల తమ అభిమానాన్ని చాటుకుంది. యూట్యూబర్‌ సుమిత్‌ చాంగ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలో స్థానికులు సినిమా పోస్టర్లను చేతబట్టి సందడి చేయడం కనిపించింది. సంప్రదాయ సంగీతం, డప్పుల మోత మధ్య కొందరు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మరికొందరు భక్తి గీతాలు ఆలపిస్తూ శ్రీరాముడిని స్మరించారు.

ఈ సందడి కేవలం వీధులకే పరిమితం కాలేదు. కరాచీలోని లక్ష్మీనారాయణ ఆలయంలోనూ ‘రామాయణ’ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. చిత్రబృందం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, దర్శకుడు నితేశ్‌ తివారీ సహా చిత్ర యూనిట్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించాలని అన్నారు. కొందరైతే ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డును సైతం గెలుచుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో తొలి భాగం 2026 నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.