Viral Video |కారు పైకి దూకి 40 కి.మీ ప్రయాణించిన హెడ్ కానిస్టేబుల్
కోయంబత్తూరు, ఆంధ్రప్రభ: సినిమాల్లో మాత్రమే కనిపించే యాక్షన్ సీన్‌ను తలపించే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అక్రమంగా గుట్కా తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. కదులుతున్న కారుపైకి దూకి.. దాని టాప్‌ను గట్టిగా పట్టుకుని సుమారు 40 కిలోమీటర్ల పాటు ప్రయాణించి నిందితులను పట్టుకున్నారు.
కోయంబత్తూరు సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారును అనుమానంతో ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న వ్యక్తులు పోలీసులను గమనించి వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో వెంటనే అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో కారుపైకి దూకారు.
వేగంగా వెళ్తున్న కారు టాప్‌ను పట్టుకుని వేల్మురుగన్ దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ సమయంలో నిందితులు కారును ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హెడ్ కానిస్టేబుల్ పట్టువదలకుండా వ్యవహరించారు.
చివరకు పోలీసులు సమన్వయంతో వాహనాన్ని అడ్డుకుని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. బెంగళూరు నుంచి కోయంబత్తూరు వైపు సుమారు 300 కిలోల గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కారును తనిఖీ చేసిన పోలీసులు భారీగా గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా సినిమాల్లో కనిపించే ఛేజింగ్ సీన్‌ను నిజ జీవితంలో చూపించినట్లుగా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
