Viral Video |ఈ వీడియోలో డ్యాన్స్‌ చేసేది మనుషులు అనుకుంటే పోరపాటే!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: సాంకేతికత ఎంత వేగంగా మారుతోందో చెప్పడానికి ఇదో బెస్ట్ ఉదాహరణ. చేతిలో మెరిసే కత్తి.. ఒంటిపై సౌదీ సాంప్రదాయ దుస్తులు.. వెనకాల మోగుతున్న అరబ్ డ్రమ్స్ లయకు అనుగుణంగా అడుగులు వేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే అక్కడ డ్యాన్స్‌ చేసింది మనుషులు అనుకుంటే పోరపాటేనండోయ్‌.. అవున అక్కడ డ్యాన్స్‌ చేసేది రోబోలు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? రియాద్‌లో జరిగిన ఒక వేడుకలో ఈ అరుదైన దృశ్యం నిజంగానే సాకారమైంది. చైనాకు చెందిన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోట్లు సౌదీ అరేబియా ప్రసిద్ధ సాంప్రదాయ ‘అర్దా’ (Ardah) కత్తి నృత్యాన్ని ప్రదర్శించి అతిథులను మంత్రముగ్ధులను చేశాయి.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రియాద్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు రియాద్ ప్రాంత మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యాఫ్ అల్-ముక్రిన్‌తో పాటు సౌదీ అరేబియాలోని చైనా రాయబారి చాంగ్ హువా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపైనే చైనా సాంకేతిక వింతగా రూపొందిన ఈ రోబోలు తమ నృత్య ప్రతిభను ప్రదర్శించాయి.

ఈ ప్రదర్శన కోసం రోబోలకు ప్రత్యేకంగా సౌదీ సాంప్రదాయ దుస్తులైన థోబ్స్ (Thobes), ఘుత్రాలను (Ghutras) తొడిగారు. చేతుల్లో ఉత్సవ ఖడ్గాలను పట్టుకున్న ఈ హ్యూమనాయిడ్లు.. డ్రమ్స్ శబ్దానికి అనుగుణంగా ఒక క్రమ పద్ధతిలో కదులుతూ, తిరుగుతూ, నమస్కరిస్తూ సందడి చేశాయి.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఈ అసాధారణ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను చైనా రాయబారి చాంగ్ హువా స్వయంగా తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. “చైనాలో తయారైన రోబోలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. విచ్చేసిన అతిథులపై ఇవి ప్రగాఢమైన ముద్ర వేసాయి” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.