వినుకొండకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి

  • జీవి ఆంజనేయులు

శావల్యాపురం, ఆంధ్రప్రభ: వినుకొండ నియోజకవర్గానికి జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైన శావల్యాపురం మండల క్రీడాకారిణులను బుధవారం ఆయన కార్యాలయంలో అభినందించారు. 11వ అంతర్ జిల్లాల మహిళల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లా అల్లూరు లో జరిగింది. ఈ పోటీలలో శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామానికి చెందిన ముక్కపాటి లికిత, శానంపూడి గ్రామానికి చెందిన ఆకుమల్ల సమీరాలు పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.

ఈనెల 24వ తేదీ నుండి 28 వరకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగే జాతీయ స్థాయి మహిళల బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొననున్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన ముక్కపాటి లిఖిత, ఆకుమల్ల సమీరాలను అభినందించి వారికి నగదు పారితోషకం అందించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం నుండి జాతీయస్థాయి పోటీలలో బాలికలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు రాగుల రాధాకృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.