ప్రయాణికులను కాపాడిన గ్రామస్తులు
- అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఘటన
- బస్సులో 20 మంది ప్రయాణికులు..
- సురక్షితంగా బయటకు తరలింపు
విడపనకల్లు, ఆంధ్రప్రభ: భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వంకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ వంకలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే.. దర్గా హోన్నూరు నుంచి ఉరవకొండకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు విడపనకల్లు మండలం పరిధిలోని ఉండబండ వంక వద్దకు చేరుకుంది. అదే సమయంలో మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహాన్ని గమనించకుండా బస్సు ముందుకు వెళ్లడంతో వంక మధ్యలో చిక్కుకుపోయింది.
బస్సు వరదలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.
