విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం!
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం!
- 24 గంటలుగా అంధకారంలోనే జరుగువానిపాలెం
- అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువు
- సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక
కోడూరు, ఆంధ్రప్రభ: విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని విద్యుత్ శాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.
కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని శివారు గ్రామం జరుగువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. దీంతో చిన్నారులతో సహా గ్రామస్థులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థులంతా ఏకమై విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
