గ్రామాభివృద్ధి పనులపై గ్రామసభలో చర్చ
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికకు ప్రజల భాగస్వామ్యం..
నీటి నిల్వలు, మౌలిక వసతులకు ప్రాధాన్యం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : వీబీజేఆర్ఏఎంజీ పథకం అమలులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్ హాజరై గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై గ్రామస్తులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వీబీజేఆర్ఏఎంజీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టే అవకాశం ఉందన్నారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో స్థానిక అవసరాలను గుర్తించి కొత్త పనులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ముఖ్యంగా నీటి నిల్వ పనులు, గ్రామ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేదల జీవనోపాధులు మెరుగుపడేలా పనులను ఎంపిక చేయాలని అధికారులకు, గ్రామపంచాయతీ పాలకవర్గానికి సూచించారు.
వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామానికి అవసరమైన పనులను గుర్తించాలని తెలిపారు. ఎంపిక చేసిన పనుల వివరాలను తుది గ్రామసభలో చదివి వినిపించిన అనంతరం గ్రామపంచాయతీ తీర్మానాలతో మండల కార్యాలయానికి పంపించాలని సూచించారు.
గ్రామసభలో సర్పంచ్ ఏమే సమీర్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు రాడే మురళి, మాజీ సర్పంచ్ అప్సర్, ఉపాధి హామీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
