నేడు జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించదగిన కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్నపాటి వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, కుటుంబ వివాదాలు తదితర కేసులకు సంబంధించి అర్హత ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. సంబంధిత కేసుల్లోని కక్షిదారులను గుర్తించి, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులను లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా ప్రోత్సహిస్తూ, న్యాయ సేవా సంస్థలు, సంబంధిత న్యాయస్థానాలతో సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమయం, ఖర్చు ఆదా చేసుకుంటూ పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని, అర్హత ఉన్న ప్రతి కక్షిదారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా కోరారు.
